పది మాసాలు మోశావు పిల్లలను
బ్రతుకంతా మోశావు బాధలను
ఇన్ని మోసిన నిన్ను
మోసేవాళ్లు లేక వెళుతున్నావు
ఈ జీవనతరంగాలలో... ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము
ఎంతవరకీ బంధము
కడుపు చించుకు పుట్టిందొకరు
కాటికి నిన్ను మోసేదొకరు
తలకు కొరివి పెట్టేదొకరు
ఆపై నీతో వచ్చేదెవరు
ఆపై నీతో వచ్చేదెవరు
ఈ జీవనతరంగాలలో... ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము
ఎంతవరకీ బంధము
మమతే మనిషికి బంధిఖాన
భయపడి తెంచుకు పారిపోయినా
తెలియని పాశం వెంటపడి
ఋణం తీర్చుకోమంటుంది
తెలియని పాశం వెంటపడి
ఋణం తీర్చుకోమంటుంది
నీ భుజం మార్చుకోమంటుంది
ఈ జీవనతరంగాలలో... ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము
ఎంతవరకీ బంధము
తాళికట్టిన మగడు లేడని
తరలించుకు పోయే మృత్యువాగదు
ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవు
ఆ కన్నీళ్లకు చితిమంటలారవు
ఈ మంటలు ఆ గుండెను అంటక మానవు
ఈ జీవనతరంగాలలో... ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము
ఎంతవరకీ బంధము
ఈ జీవనతరంగాలలో ఓ ఓ