Elige una pista para reproducir
॥పల్లవి॥ ఆతుర బందుగుఁడవు అన్నిటా నాకు
యీతల నున్నాఁడవుగా యెప్పుడైనాను
॥చ1॥ తలఁగి నీరాక గోరి దప్పిఁ బొరలేటివేళఁ
గలవుగా యిప్పుడైనాఁ గప్పురమీయ్య
జలజలఁ జెమరించి సదమదమై యుండగా
వెలినుండి వచ్చితిగా విసరనైనా
॥చ2॥ చేరి నిన్నుఁ దలఁచుక చింతతోడ నుండఁగాను
నీరూపు చూపితివిగా నేఁడైనాను
ఆరీతి నిట్టూరుపుల నసురుసురై వుండఁగా
గారవించి స్వస్తపెట్టి కందువ నిల్తువుగా
॥చ3॥ నీకుఁగా నెదురుచూచి నవ్వెరగై వుండఁగాను
కైకొని శ్రీవేంకటేశ కలసితివి
యీకడ నలమేల్మంగ నిటు సేవసేయఁగా
మేకొని యిప్పుడు నన్ను మెత్తువుగా నీవు