Elige una pista para reproducir
॥పల్లవి॥ వెఱవకు చెప్పవయ్యా వెనక వేసుకొనేను
పఱచుఁజేఁతల వో పండరంగివిట్టలా
॥చ1॥ పీలిపాగవన్నెలవి ప్రేమపు నీ కామినుల
కాలిగోరిలత్తుకలు గమ్మినటువలె నుండే
మూలల నీ వేటికైనా మొక్కితివో వారిచూపు
కోలుముందై నీవు రాఁగా కోలలై తగిలెను
॥చ2॥ మెడని తులసిదండ మెలఁతల కోరికలు
పొడమి చిగురులై పొందినటువలె నుండె
అడరి వారితనువు లచ్చుగా ధరించితివో
కడు నిన్నుఁ జెనకేటి కరపల్లవములో
॥చ3॥ కట్టిన పీతాంబరము కామినుల కుంకు మెల్లా
అట్టే అద్ది నవన్నె లైనటువలె నుండె
నెట్టన శ్రీవేంకటేశ నీవు నన్నుఁ గూడితివి
అట్టే వారివలపో నా యనురాగమో