Elige una pista para reproducir
॥పల్లవి॥ మానరో వో లోకులాల మాకు మీకు నేమి దోడు
నాఁటికిఁక మీకు నవ్వుఁబాటు నేము
॥చ1॥ యిరవై నానోటికి యెన్నెన్ని చదివిన
హరియనేయంతరుచి అందు లేదు
గరిమ నెన్నిరూపులు కన్నుల నేఁ జూచినాను
పురుషోత్తముఁ జూచినపూర్తి యందు లేదు
॥చ2॥ యెచ్చోట నుండినాను యిందిరేశుమందిరము
చొచ్చి యుండేసుఖ మంత చొప్పడ దందు
కచ్చుపెట్టి వీనులకుఁ గతలెన్ని విన్నాను
అచ్చుతుకీర్తన వినేయందు సరి రాదు
॥చ3॥ కైపుగాఁగ కన్నవారికాళ్ళకు మొక్కినాను
శ్రీపతికిమొక్కినంత సెలవు గాదు
యేపున శ్రీవేంకటేశు నిటులఁ బూజించినట్టు
మాపుదాఁకా నితరుల మనసురాదు