Elige una pista para reproducir
॥పల్లవి॥ పెద్ద తెరువుండఁగాను పెడగంతలు దీసుక
పొద్దువోక యడవులఁ బుంగుడయ్యేరు
॥చ1॥ తొల్లిటి పెద్దలెంచిరి దొడ్డవాఁడు హరియంటా
అల్లదె భారత రామాయణ భాగవతములు
ఇల్లిదె నేఁటి పెద్దలు యెవ్వరో దైవములంటా
వెల్లవిరిగా నింకా వెదకేరు
॥చ2॥ దేవలోకమువారు దేవుఁడు శ్రీపతియని
భావించి మొరవెట్టి బ్రదికిరి
యీవల నిప్పటివారు ఇందరికి మొరవెట్టి
కావిరి నెవ్వరివారుఁ గాక వున్నారు
॥చ3॥ నానాభూములవారు నమ్మి శ్రీవేంకటపతిఁ
గానవచ్చి యేఁటనేఁట ఘనులయ్యేరు
యీనిజ మిక్కడివారు యిన్నియుఁ దెలిశుండియు
మానక చలాలఁబోయి మాయలఁ బొందేరు