Elige una pista para reproducir
॥పల్లవి॥ ఎటువలెఁ జేసితివో యెఱఁగ మెన్నఁడును
ఘటియించవయ్యా మాతో కందము నీసుద్దులు
॥చ1॥ పూసినకస్తూరి పూఁత పొంచినట్టినడురేయి
వోసరించి మాయధర ముట్టిపై పాలు
ఆసపడి గొల్లయిండ్ల నల్లఁవాడు సేసినట్లు
సేసి చూపవయ్య మాకు చిత్రము నీసుద్దులు
॥చ2॥ అదె మాసెలవినవ్వు యమునలోని వెన్నెల
చదురుసరసాలు రాసక్రీడలు
తుదిముట్ట గొల్లెతల తొల్లి నీవు సేసినట్లు
యిదె మాతోఁ జేయవయ్య యెట్టివో నీసుద్దులు
॥చ3॥ ఇక్కువ బృందావనము ఇచ్చట మాజవ్వనము
చక్కనిసతుల పొందుసరి నాపొందు
చిక్కి శ్రీవేంకటేశ్వర చిన్ననాఁడు గొల్లెతల
చొక్కించినట్టె చొక్కించు చూతము నీసుద్దులు