Elige una pista para reproducir
॥పల్లవి॥ రమ్మనవమ్మ విభుని రత్నాలపెట్టె
చిమ్మొకొనగోళ్ళ నారీశిరోమణి
॥చ1॥ చిత్తగించవమ్మ పతిఁ జిలుకలకొలికి
చిత్తజుదీమమా వోసింగారదండా
గుత్తపుగుబ్బలతీరు కొనియాడీ నీమగఁడు
బత్తి చేకొనఁగదమ్మ బంగారుబొమ్మ
॥చ2॥ సుద్దులు చెప్పఁగదమ్మ చొప్పాణిముత్తెమా
పొద్దువొద్దు నీపతికి పువ్వారుఁబోణి
అద్ది జవ్వాది వూసీ నీ కతఁడు కారుమెఱుఁగ
వద్దనక చేకొనవో వనముకోగిలా
॥చ3॥ ముచ్చటలాడఁగదమ్మ ముంగిటినిధానమా
గచ్చులేల రా వోచెంగలువబంతీ
హెచ్చి శ్రీవేంకటేశుఁడు యిన్నిటాను నిన్నుఁ గూడె
రచ్చకెక్కె నీవలపు రాయంచకొదమా